గ్యాస్ కొరత.. ప్రజల గోడౌన్ల బాట

కలం, ఖమ్మం బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్యాస్ కొరత (LPG Crisis) తో సామాన్యులు, వ్యాపారులు గ్యాస్ గోడౌన్ బాట పట్టారు. ప్రజలకు కొంత ఆలస్యంగానైనా గ్యాస్ దొరుకుతుంది. కానీ వ్యాపారులకు మాత్రం గ్యాస్ దొరకడం లేదు. దీంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించక తప్పడం లేదు. అయితే గడిచిన రెండు రోజుల నుంచి బ్లాక్ లో కూడా గ్యాస్ దొరకని పరిస్థితి. ఇక చేసేది లేక కొంత మంది వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్ ను ఉపయోగించి వ్యాపారాలు నడుపుకుంటున్నారు. ఇదే పరిస్థితి ఇంకో 10 రోజులు కంటిన్యూ అయితే, వ్యాపారులకు డొమెస్టిక్ గ్యాస్ కూడా దొరకదు. అప్పుడు హోటళ్లు మూసుకోవాల్సిందేనని చిన్న చిన్న వ్యాపారులు వాపోతున్నారు.

సాధారణంగా టిఫిన్లు అమ్మే హోటళ్లకు 19 కేజీల గ్యాస్ సిలిండర్ నాలుగు నుంచి ఐదు రోజుల వరకూ వస్తుందని చెప్తున్నారు. దీనికి వారు రూ.1700 చెల్లించేవారు. ఈ మధ్య బ్లాక్ లో రూ.2300 కూడా పెట్టి కొన్న సందర్భాలు ఉన్నాయని, ప్రస్తుతం అయితే ఎంత పెట్టినా కమర్షియల్ సిలిండర్ దొరకడం లేదు అంటున్నారు. గత్యంతరం లేని సందర్భాల్లో ఇంట్లో వాడుకునే సిలెండర్ నే హోటళ్లకు ఉపయోగించు కుంటున్నామని కొందరు చెప్తున్నారు.

బుకింగ్​ లో ఇబ్బందులు..

నేను నాలుగు రోజులుగా గ్యాస్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే, ఈ రోజు నంబర్ కలిసింది. వెంటనే బుక్ చేశాను. ఓటీపీ వస్తేనే సిలెండర్ ఇస్తామని గ్యాస్ ఏజెన్సీ వారు చెప్తున్నారు. మొత్తం మీద నాలుగు రోజుల తర్వాత నాకు సిలిండర్ దొరికింది. విచిత్రమేమిటంటే ఒక్కోసారి బుకింగ్ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది : నరేష్, గృహ వినియోగ దారుడు, ఖమ్మం

కమర్షియల్​ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది..

కమర్షియల్ సిలిండర్ దొరకడం కష్టంగా మారింది. ఇంకో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటే హోటల్ మూసి వేస్తాను. ఇప్పటికే గ్యాస్ అవసరం లేని వస్తువులు తీసుకొచ్చి అమ్ముదామనుకుంటున్నా. ఇప్పటికే కూల్ డ్రింక్స్, నిమ్మరసం, మొక్కజొన్న కంకులు తెచ్చాను. ఎందుకంటే బిజినెస్ ఉన్నా లేకున్నా రెంట్ కట్టాలి కదా. అందుకే వేరే వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నాను : చిరంజీవి,హోటల్ నిర్వాహకుడు, మణుగూరు

గ్యాస్ కొరతకు సంబంధించి ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ఎవరైనా గ్యాస్ అక్రమ నిల్వలు పెట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హెచ్ పీ, భారత్, ఇండియన్ కంపెనీలు కలిపి సుమారు 40 గ్యాస్ ఏజెన్సీలు సేవలు అందిస్తున్నాయి. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల కనెక్షన్లు, దీపం కనెక్షన్లు, సాధారణ కనెక్షన్లు కలిపి 7లక్షల వరకూ ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో సుమారు 12వేల కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, కొత్తగూడెం జిల్లాలో సుమారు 6 వేల వరకు కమర్షియల్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>