రైతులకు కరెంట్ కట్కట.. లోవోల్టేజీతో కాలిపోతున్న బోరుమోటార్లు

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు (Nalgonda Farmers) కరెంటు కటకట.. మరోవైపు ఎల్ నినో ఎఫెక్ట్‌ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక ప్రాజెక్టుల్లో జలకళ కరువైంది. ఇప్పటికే నాట్లు పడాల్సిన పొలాలు.. నేటికి పూర్తిగా తడిచింది లేదు. కరిగట్టు చేసేందుకు రైతులకు రోజుల తరబడి సమయం పడుతోంది. పూర్తి స్థాయిలో విద్యుత్ రాకపోవడంతో ఒక మడిని తడిపి దున్నేసరికి పాణం మీదకు వస్తోంది. దీంతో సాగు పడకేస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత, ఉక్కపోతతో గృహ అవసరాలకు వాడకం పెరిగి, వేసవి మించిన విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఉచిత, నిరంతర విద్యుత్ మాట దేవుడెరుగు, ఉన్న కరెంటు సరిగా రాక, నాట్లు పడాల్సిన పొలాలు కనీసం తడవడం కూడా లేదు.

నాట్లు పడేదెప్పుడో..?

పొలాన్ని కరిగట్టు చేసేందుకు రైతులకు రోజుల తరబడి సమయం పడుతోంది. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలతో పొలంలో ఒకపక్క తడిపి దున్నేసరికి, మరోపక్క ఎండకు ఇంకో మడి గట్టిపడుతోంది. దీంతో ఖరీఫ్ పంటల సాగు పూర్తిగా పడకేసింది. కనీసం ఒక మడి పూర్తిస్థాయిలో పారకముందే కరెంటు కోతలు ప్రారంభమవుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిజానికి వర్షాలు సకాలంలో పడితే.. ఈ పదునుకు మోటార్ల పదును తోడయ్యి తొందరగా కరిగట్టు అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఎల్ నినో కారణంగా ఎండాకాలాన్ని తలపించేలా ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు పంటల సాగు ముందట పడే పరిస్థితి కనిపించడంలేదు.

రాత్రివేళల్లో కోతల మంట

విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరగడం. జలవిద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం విద్యుత్ వ్యవస్థను మరింత దెబ్బతీసింది. వానాకాలంలోనూ రాత్రి సమయాల్లో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం వల్ల లోడు విపరీతంగా పడుతోంది. వ్యవసాయానికి కూడా రాత్రిపూట కరెంటు ఇస్తే, లోడు ఎక్కువై గ్రిడ్ మొత్తం ట్రిప్ అయ్యే ప్రమాదం ఉందని భావించిన అధికారులు, రాత్రివేళల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. పగటిపూట ఇస్తున్నా దాదాపు 9 నుంచి 12 గంటల విద్యుత్ సరఫరాలోనూ నాణ్యత కొరవడింది.

దీంతో లోవోల్టేజీ సమస్య ఏర్పడి బోరుమోటార్లు తరచూ కాలిపోతున్నాయి. మోటార్ ఎత్తుకోకపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్ అవడం, ఫ్యూజులు ఎగిరిపోవడంతో ఒక్కోసారి మోటారు బాగు చేయించడానికి రైతుకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు అదనపు ఖర్చు అవుతోంది. మరోవైపు లోవోల్టేజ్ కారణంగా కేవలం వ్యవసాయ మోటార్లే కాకుండా ఇళ్లలోని ఫ్యాన్లు, ఫ్రిజ్ లు, టీవీలు, లైట్లు కూడా కాలిపోతున్నాయి. కనీసం లైటు వెలగక, ఫ్యాన్ తిరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వారం రోజులుగా మరీ దారుణం

వారం రోజులుగా కరెంట్ కోతల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి లోవోల్టేజీ సమస్యను అధిగమించేలా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తేవాలని, సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎండిపోతున్న పంటలతో పాటు రైతుల బతుకులు కూడా ఆగమైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండుసార్లు కాలిపోయిన మోటారు

వారం రోజుల్లోనే రెండు సార్లు మోటారు కాలిపోయింది. వైండింగ్ చేయించడానికే ఐదారు వేలు అయ్యాయి. ఆటో చార్జీలు, మోటారు విప్పే కూలీ ఖర్చులు అదనం. ఓ పక్క పంటకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదో తెలీదు. ఈ మోటార్ల రిపేర్లకే ఖర్చు ఎక్కువగా అయింతుంది. రాత్రిపూట కరెంటు తీసేశారు, పగలు ఇచ్చే కరెంటేమో లోఓల్టేజీతో మోటార్లను కాలుస్తుంది. మా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు స్పందించి, మంచి కరెంటు ఇచ్చి మా పంటలను కాపాడాలి.
– బొడ్డుపల్లి సైదులు, నర్మెట్ట, చండూరు మండలం, యాదాద్రి జిల్లా

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>