2027లోగా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి.. త్వరలోనే నీళ్లు అందిస్తాం: పొన్నం

కలం, శ్రీరాములపల్లి: హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరాములపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించడంతో పాటు, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

గౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రాధాన్యం..

గౌరవెల్లి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేసి త్వరలోనే నీటిని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు ద్వారా 714 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి ప్రభుత్వ పథకాలను అందిస్తామని చెప్పారు. గ్రామం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, భూమి ఉన్న ప్రతి రైతు ఫార్మ్ పాండ్ నిర్మించుకోవాలని సూచించారు. ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని రైతులకు, అధికారులకు సూచించారు. 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలు గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. షుగర్, బీపీ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

గర్భిణులు  జాగ్రత్తగా ఉండాలి..

గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పాలు, గుడ్లు, పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పుట్టిన పిల్లలకు ఆరు సంవత్సరాల వరకు గుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందేలా చూడాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, అవసరమైతే అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని సూచించారు.

గ్రామ సమస్యల పరిష్కారానికి హామీ..

గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న వీ.ఓ. భవనం నిర్మాణానికి రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. వాటర్ ప్లాంట్ బోర్‌వెల్, గ్రామపంచాయతీ భవనం తదితర సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా జాగిని సరోజన, మహంకాళి రేణుకలకు కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం ఎంన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.26 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రామాల పర్యటన చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>