కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆకస్మికంగా పరిశీలించారు. బస్ స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల సమయపాలన, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన మంత్రి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల నిర్వహణ, సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం మాత్రమే కాకుండా, మహిళలను బస్సుల యజమానులుగా చేస్తుంది అని తెలిపారు మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి ముందుకు సాగేందుకు అవసరమైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమం లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

