కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం పట్టణం నుంచి తల్లాడ మీదుగా జగ్గయ్యపేట వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) అన్నారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీకి, అలాగే రాష్ట్ర రాజధానిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆదివారం ప్రత్యేకంగా లేఖలు పంపించారు. సుమారు వంద కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రహదారి కొత్తగూడెం (NH-30), వైరా మీదుగా జగ్గయ్యపేట(NH-65)లను అనుసంధానిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, గిరిజన ప్రాంతాలను కలిపే వ్యూహాత్మక రహదారిగా ఉందని వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, బిటిపిఎస్, హెవీ వాటర్ ప్లాంట్ వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు ఉండటంతో ఇది కీలక పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని గుర్తుచేశారు. ఈ రహదారి పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు వంటి ప్రాంతాలను అనుసంధానించడంతో పాటు అంతర్జాతీయ పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకోవడానికి భక్తులకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే తూర్పు, మధ్య తెలంగాణలో రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని, ముఖ్యంగా బొగ్గు రవాణా వంటి పారిశ్రామిక అవసరాలు సులభతరం అవుతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జగ్గయ్యపేట వద్ద ఎన్‌హెచ్-65తో అనుసంధానం కావడం ద్వారా ప్రధాన మార్కెట్లకు నేరుగా రవాణా సౌకర్యం ఏర్పడుతుందని, ఇది గ్రామీణ ప్రాంతాల సామాజిక–ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ రహదారి అభివృద్ధి పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను కోరారు.

