Mobile Popup Ad
Mobile Popup Ad

ఉచిత ప్రయాణంపై విమర్శలు.. మంత్రి స్ట్రాంగ్​ కౌంటర్​

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ శాసన మండలిలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకంపై జరిగిన చర్చలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలకమైన అంశాలను వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారని, సోషల్ మీడియాలో మహిళలను అవమానపరిచేలా చిత్రాలను ప్రచారం చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశామని, దీనివల్ల బస్సుల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ 69 శాతం ఉండగా, ఇప్పుడు అది ఏకంగా 98 శాతానికి చేరుకుందని మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం సంస్థను బరువుగా భావిస్తే, తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా ఆర్టీసీని లాభాల బాటలోకి మళ్లించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాత బకాయిలను తీర్చడంలో ప్రభుత్వం చూపిస్తున్న చొరవను ఆయన వివరించారు. సీసీఎస్ బకాయిలు 664 కోట్ల నుండి 300 కోట్లకు, అలాగే పీఎఫ్ బకాయిలు 1350 కోట్ల నుండి 600 కోట్లకు తగ్గించినట్లు వెల్లడించారు. కేవలం అప్పులు తీర్చడమే కాకుండా, ప్రయాణికుల సౌకర్యార్థం 100 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని, ములుగు జిల్లా ఏటూరు నాగారం, పెద్దపల్లిలో కొత్తగా బస్ డిపోలను ఏర్పాటు చేశామని చెప్పారు.

గత పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం 3038 కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిందని మంత్రి తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం వేగంగా స్పందించిందని, గతంలో ఒక్క బస్సు కూడా కొనని పరిస్థితి నుండి ఇప్పుడు 2708 కొత్త బస్సులను కొనుగోలు చేసి కొత్త రూట్లను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, 600 బస్సులకు మహిళలను యజమానులను చేశామని, దీనివల్ల మహిళా సంఘాలకు నెలకు 70 వేల రూపాయల ఆదాయం అందుతోందని తెలిపారు.

1132 కారుణ్య నియామకాలు పూర్తి చేశామని, తార్నాక హాస్పిటల్ అభివృద్ధికి 17 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Ponnam Prabhakar) చెప్పారు. 2017 పీఆర్సీకి సంబంధించి 21 శాతం ఫిట్ మెంట్ అందించడంతో పాటు, యూపీఐ సహకారంతో కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. వివిధ కారణాలతో తొలగించబడిన 250 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని వారి కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, వారు కూడా తమ కుటుంబ సభ్యులేనని, వారి కోసం త్వరలోనే ప్రత్యేక స్కీమ్ తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Read Also: మాజీ మంత్రి హరీశ్ రావు చేతికి గాయం

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>