కలం, కరీంనగర్ బ్యూరో: హుస్నాబాద్‌లోని శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) ఇంజనీరింగ్ కళాశాల, హాస్టల్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని తరగతి గదులు, హాస్టల్ వసతులు, భోజన శాలను పరిశీలించి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా నోట్ చేసుకుని, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యమైన భోజనం..ప్రత్యేక కమిటీ
హాస్టల్‌లో విద్యార్థులకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. రోజూ సిబ్బందిలో ఒకరు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, భోజన నాణ్యత పర్యవేక్షణకు విద్యార్థులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాను హుస్నాబాద్ వచ్చిన ప్రతిసారీ హాస్టల్లోనే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని వెల్లడించారు.
విద్యార్థులకు భరోసా
“విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా అడిగే హక్కు నాకు ఉంది. నేను మీ గార్డియన్‌గా ఉంటాను” అని పేర్కొన్నారు. బాయ్స్ హాస్టల్ బాత్రూమ్ సమస్యలు, లైబ్రరీ, రవాణా సదుపాయాలు (బస్సులు) తక్షణమే కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి లైబ్రరీ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.
విద్యార్థుల కోసం స్పోర్ట్స్ కిట్లు అందిస్తామని, సమీపంలోని స్టేడియంను ఉపయోగించుకుని క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కళాశాల టాపర్లకు ల్యాప్‌టాప్‌లు, అవసరమైన వారికి సైకిళ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు.విద్యార్థులకు క్యాంపస్ సెలెక్షన్స్, ప్లేస్‌మెంట్స్ తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల రిటైర్డ్ ప్రొఫెసర్లతో మోటివేషనల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
డ్రగ్స్ రహిత ప్రాంగణం
విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. తల్లిదండ్రుల ఆశయాలు నిలబెట్టాలి అన్నారు. “1987లో డిగ్రీ కళాశాల ప్రెసిడెంట్‌గా నా ప్రస్థానం మొదలైంది. లక్ష్యంతో చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పంపారు, మంచిగా చదువుకుని వారికి, యూనివర్సిటీకి పేరు తేగలగాలి” అని విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, అధ్యాపకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
Also Read : సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు బంద్
Follow Us On: X(Twitter)

