కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ తరహా రాష్ట్రంలోని 4 కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఈ దీపావళి పర్వదినాన ప్రతి ఇందిరమ్మ ఇంట్లో ఆనందోత్సాహాలనడుమ దీపావళి వేడుకల జరపాలని పిలుపునిచ్చారు. ఆరోజున పేదల ఇంట్లో వెలిగే ప్రతిదీపం తెలంగాణ ప్రజాప్రభుత్వ సంకల్పానికి ప్రతీక కావాలని ఆకాంక్షించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. ఈ మేరకు “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు” అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. దీపావళి రోజున గృహ ప్రవేశాలు జరుపుకున్న ఇళ్లకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ళ కమిటీ సభ్యులు వెళ్లి వారితో మమేకమై ఆనందాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నా.. పేదలకు ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో పనిచేసిందని పొంగులేటి తెలిపారు. పేదల ఆత్మగౌరవానికి చిహ్నమైన ఇందిరమ్మ ఇళ్లను శరవేగంగా నిర్మించేందుకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తొలివిడతలో భాగంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటికి 2,21,500 ఇళ్లలో గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 1.90 లక్షల ఇళ్ళు వివిధ నిర్మాణదశల్లో ఉన్నాయని తెలిపారు.
రెండో విడతలో భాగంగా 2.50 లక్షల ఇళ్లతో పాటు హైదరాబాద్ క్యూర్ ఏరియా పరిధిలో లక్ష ఇళ్లను మంజూరు చేశామని పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న విధంగానే రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్ లను నిర్మిస్తామని ప్రకటించారు. జీ+5 పద్దతిలో నిర్మించనున్న ఈ టవర్స్ నిర్మాణానికి సంబంధించి దీపావళి లోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని అన్నారు, రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోందని.. దీనిని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆపేదిలేదని స్పష్టం చేశారు.

