కలం, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి(Sri Sathya Sai) జిల్లాలోని తలుపుల మండలం పులిగుండ్లపల్లి (Puligundlapalli) గ్రామ శివారులో గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దాడులు నిర్వహించారు. అక్కడ గుప్తనిధుల తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే గంగాధర అనే వ్యక్తి మాత్రం పరారైనట్లు వెల్లడించారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టయిన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

