డ్రగ్స్ నిర్మూలనపై త్వరలో కంట్రోల్ రూమ్: కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లాలో (Mahabubnagar) మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డీ. జానకితో కలిసి పాలమూరు యూనివర్సిటీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ ప్రతినిధులుతోపాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీసు, ఎక్సైజ్, విద్యాశాఖ తదితర అధికారులతో నిర్వహించిన నార్కోటిక్స్ అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తెలియ చేయాలని, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, హాస్టళ్లలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్లను (Anti Drug Awareness) తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టర్లను తరగతి గదులు, హాస్టల్ ప్రవేశ ద్వారాలు, సమావేశ ప్రాంగణాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, తల్లిదండ్రులు వచ్చే ప్రదేశాలు వంటి విద్యార్థులకు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. పోస్టర్ నమూనాను మూడు రోజుల్లో అందజేస్తామని, అన్ని విద్యాసంస్థలు దానికి అనుగుణంగా అమలు చేయాలని తెలిపారు.

విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన లక్షణాలను గుర్తించేలా అధ్యాపకులు, వార్డెన్లు, భద్రతా సిబ్బందికి అవగాహన ఉండాలని కలెక్టర్ సూచించారు. హాస్టళ్లలోకి విద్యార్థులు తీసుకువచ్చే బ్యాగులను అవసరమైతే తనిఖీ చేయాలని, రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. మద్యం సేవించడం చాలా సందర్భాల్లో మాదకద్రవ్యాల వినియోగానికి ప్రారంభ దశగా మారుతుందని, అందువల్ల మద్యం వినియోగాన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లా ఎస్పీ డీ. జానకి మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే సంబంధిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే యువతను మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చన్నారు. డ్రగ్స్ నియంత్రణ అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత కాదని, ప్రతి పౌరుడు సమాచారం అందించడంలో భాగస్వామి కావాలని కోరారు. జిల్లాను డ్రగ్ ఫ్రీ మహబూబ్‌నగర్‌గా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) కార్యదర్శి డీ. ఇందిర మాట్లాడుతూ.. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) అమలు చేస్తున్న డ్రగ్ అవేర్‌నెస్ అండ్ వెల్‌నెస్ నావిగేషన్ పథకం ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు విద్యార్థులందరినీ హాజరయ్యేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించిన విద్యార్థులపై వెంటనే శిక్షాత్మక చర్యలకే పరిమితం కాకుండా, ముందుగా కౌన్సెలింగ్, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం, అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించడం వంటి పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పోలీసు శాఖతో పాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, పారాలీగల్ వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తే యువతను డ్రగ్స్ బారినుంచి కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు, సమావేశంలో వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు, విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై తరచూ అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాలను కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ప్రతినిధులు, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>