కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Prateek Jain) తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 08455-276155 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ప్రజల నుంచి వచ్చే అత్యవసర ఫిర్యాదులు, సమాచారం, నష్టం వివరాలను వెంటనే స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు చేరవేసి తక్షణ చర్యలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరదలు, రహదారుల అంతరాయం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ అంతరాయాలు లేదా ఇతర ప్రమాదాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని కోరారు. అవసరం లేకుంటే ప్రజలు బయటకు వెళ్లవద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విజ్ఞప్తి చేశారు.

