కలం, నల్లగొండ బ్యూరో : పేదలను హింసించే దొరల గడీల్లా పోలీసు స్టేషన్లు మారాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ (Manda Krishna) ఆరోపించారు. సూర్యాపేటలోని జె గార్డెన్ లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘కోదాడ కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనలో నాటి కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట ఎస్పీ నరసింహ పాత్ర ఉంది. నిజానికి కర్ల రాజేష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా చట్టవిరుద్ధంగా చిలుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం డీఎస్పీ, ఎస్పీలకు తెలుసు. ప్రతిరోజూ పోలీసు స్టేషన్ లాకప్ లకు సంబంధించిన సమాచారం ఎస్పీ, డీఎస్పీలకు ఉన్నప్పటికీ.. ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేసి రాజేష్ మరణానికి కారకులయ్యారు‘ అంటూ మండిపడ్డారు మందకృష్ణ (Manda Krishna) మాదిగ.
రాజేష్ కేసును పక్కదారి పట్టించేందుకు మొదటి నుండి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారని మందకృష్ణ తెలిపారు. ఈ కేసును కప్పిపుచ్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన డీఎస్పీ శ్రీధర్ రెడ్డిని A3 గా, ఎస్పీ నరసింహను A4 గా రాజేష్ లాకప్ డెత్ కేసులో చేర్చాలని డిమాండ్ చేశారు. ‘పోలీసు శాఖకు నిజాయితీ ఉంటే ఈ ఘటన మీద ప్రధానంగా డీఎస్పీ, ఎస్పీ పాత్రల మీద డిఐజి లేదా ఐజి లేదా అంతకన్నా ఉన్నతస్థాయి అధికారుతో విచారణ జరిపించాలి. పోలీసు స్టేషన్లలో ఉన్నత వర్గాలకు, రాజకీయ నేతలకు అత్యున్నత గౌరవం దక్కుతోంది. అణగారిన వర్గాలకు, పేదలకు అవమానాలు, హింస ఎదురవుతున్నాయి. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల నాయకులు విశ్వనాథం, జయకర్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, ఎంఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డప్పు మల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.


