కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార వ్యాపారాన్ని టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఒక అద్దె ఇంట్లో సాగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలపై దాడి చేసి నిర్వాహకులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ- హైదరాబాద్ రోడ్డులోని శ్రీనగర్ కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు తమ బృందంతో కలిసి ఆదివారం ఆ ఇంటిపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకులతో పాటు విటులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వ్యభిచార గృహం నిర్వాహకులు గుండ్రెడ్డి వెంకటరెడ్డి, లక్కమోరపు నవ్యలతో పాటు విటులు ఉదయ్, శివకృష్ణలను అరెస్టు చేశారు.
పోలీసులు వీరి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ఈ దందాను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వాట్సాప్ ద్వారా యువతుల ఫోటోలను కస్టమర్లకు పంపి, రేటు కుదిరిన తర్వాత తమ అద్దె ఇంటికే పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పట్టుబడిన బాధిత యువతులను పోలీసులు రక్షించి, వారికి కౌన్సిలింగ్ నిమిత్తం సఖి సెంటర్కు తరలించారు. పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అద్దెకు ఇళ్లు ఇచ్చే యజమానులు కూడా అద్దెకు ఉండేవారి వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.

