కాగితాల్లోనే కట్టడాలు, జేబుల్లోకి నిధులు.. పలివెలలో భారీ మోసం

కలం, నల్లగొండ బ్యూరో: అక్కడ పనులు జరగలేదు.. కానీ బిల్లులు మాత్రం పాసయ్యాయి. రికార్డుల్లో ఎంబీ నమోదు లేదు.. కానీ నిధులు మాత్రం డ్రా అయ్యాయి. గ్రామాభివృద్ధికి వెలుగులు నింపాల్సిన నిధులు.. అక్రమార్కుల జేబుల్లోకి చేరి చీకటిమయమయ్యాయి. నల్లగొండ జిల్లా (Nalgonda) మునుగోడు మండలంలోని పలివెల (Palivela) గ్రామంలో పక్కా స్కెచ్‌తో ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఉన్న ట్యాంకులకు రంగులేసి కొత్తవని నమ్మించి, దాతలు ఇచ్చిన సీసీ కెమెరాలకు ప్రభుత్వ బిల్లులు సృష్టించి.. ఏకంగా రూ. 72 లక్షలను అప్పనంగా మింగేశారు. అధికారుల అండదండలతో సాగిన ఈ కాగితాలపై అభివృద్ధి ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

స్కామ్ చేసిన తీరు ఇలా..

పలివెల గ్రామంలో ఇప్పటికే ఉన్న వాటర్ ట్యాంకులను కొత్తగా నిర్మించామంటూ రంగులేసి తిరిగి బిల్లులు తీసుకోవడం.. దాతల సాయంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలకు ప్రభుత్వ నిధుల నుంచి నకిలీ బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకున్నారని గ్రామస్థులు తెలిపారు. కనీసం పనులు చేయకుండా.. ఎలాంటి ఎంబీ రికార్డులు లేకుండానే అధికారుల అండదండలతో లక్షలాది రూపాయలు డ్రా చేశారని మాజీ వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖాళీ ఓపెన్ ప్లాట్లకు సైతం ఇంటి నెంబర్లు వేసి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.8వేల నుండి రూ.10వేల వరకు అక్రమంగా పన్నులు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు.

అధికారుల విచారణలో నిర్ధారణ..

ఈ అవినీతిపై గ్రామస్థులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలోనే బాధ్యులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం. అయితే విచారణ పూర్తయి అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా.. బాధ్యులైన మాజీ సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేసి, గ్రామాభివృద్ధికి ఖర్చు చేయాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలివెల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్, కార్యదర్శిపై చర్యలు తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లు కారణమా? అనే ప్రశ్నలు లేకపోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>