కలం, వెబ్ డెస్క్ : భారత రాజకీయ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. దేశంలో అత్యధిక కాలం నిరవధికంగా కొనసాగిన ఎలెక్టెడ్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) సరికొత్త చరిత్ర సృష్టించారు. 2014 మే 26వ తేదీన తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, నాటి నుండి నేటి వరకు నిరంతరాయంగా 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగడం ద్వారా ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు.
గతంలో ఈ రికార్డు స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉండేది. 1952లో దేశంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 13న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ, 1964 మే 27న ఆయన మరణించేంత వరకు నిరవధికంగా 4,398 రోజుల పాటు ప్రజాధారణ పొందిన ఎలెక్టెడ్ ప్రధానిగా సేవలు అందించారు. ఇప్పుడు ప్రధాని మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని ఆ రికార్డును తిరగరాశారు.
కేవలం దేశ ప్రధానిగానే కాకుండా, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా అందించిన సేవలను కూడా కలిపితే నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా అత్యున్నత పదవుల్లో 8,931 రోజులకు పైగా కొనసాగి దేశ రాజకీయాల్లోనే అత్యంత విశిష్టమైన నాయకుడిగా నిలిచారు. ఈ చారిత్రాత్మక సందర్భం నేపథ్యంలో ఢిల్లీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పక్ష నేతలతో ప్రధాని మోదీ ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో దేశ భవిష్యత్ కార్యాచరణతో పాటు, రాబోయే రోజుల్లో దేశంలో చేపట్టబోయే కీలక సంస్కరణలపై కూటమి నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం.

