కలం వెబ్ డెస్క్ : ఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) రెండో రోజు కీలక పరిణామాలతో కొనసాగుతోంది. సదస్సు వేదికైన భారత్ మండపానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఉన్నతస్థాయి ప్రతినిధులు చేరుకున్నారు. బురుండి అధ్యక్షుడు ఎవారిస్టే న్దాయీషిమియే, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్, వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, కజకిస్థాన్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ తోకయేవ్ తదితరులు భారత్ మండపానికి వచ్చారు.
నైజీరియా ఉపాధ్యక్షుడు కాషిమ్ షెట్టిమా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కూడా సదస్సుకు హాజరయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.
నేతలకు మోదీ స్వాగతం
భారత్ మండపానికి చేరుకున్న పలువురు ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. వియత్నాం ప్రధాని లే మిన్ హంగ్, సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపోతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండో రోజు చర్చల్లో బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యం, ఉమ్మడి సవాళ్లపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండో రోజు సమావేశాల్లో భారత్ ప్రతిపాదించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు కీలక అంశాలపై చర్చలు సాగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముగింపు
రెండో రోజు చర్చలు ముగిసిన అనంతరం 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముగింపు పలకనున్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, బహుళపక్ష సహకారంపై ప్రపంచానికి కీలక సందేశం వెళ్లే అవకాశం ఉంది. కాగా, సదస్సు తొలిరోజే ‘న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026’ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నేతలు వ్యక్తం చేశారు.

