బ్రిక్స్ సదస్సు 2026: నాలుగు స్తంభాలే ఎజెండాగా మోదీ కీలక ప్రసంగం

కలం వెబ్ డెస్క్: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026 (BRICS Summit ) రెండో రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక ప్రసంగం చేశారు. భారత అధ్యక్షతన బ్రిక్స్ కార్యకలాపాలను స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాల చుట్టూ ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. సభ్య దేశాల సహకారంతో ఉమ్మడి ఆలోచనలను అన్ని దేశాలకు ప్రయోజనం చేకూర్చే భాగస్వామ్యాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని మోదీ పేర్కొన్నారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా గొలుసుల అంతరాయాలు ఏ సంక్షోభమైనా సరిహద్దులను దాటి ప్రభావం చూపగలవని వివరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తులపై వేగవంతమైన స్పందనకు బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అవసరమని అన్నారు.

స్టార్టప్‌లు, రైతులు, MSMEలకు ప్రాధాన్యం

ఆవిష్కరణ రంగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్ ద్వారా స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లను అనుసంధానించనున్నట్లు ప్రధాని తెలిపారు. వినూత్న ఆలోచనలకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేందుకు స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ప్రతిపాదించినట్లు చెప్పారు. డిజిటల్ వ్యవసాయంలో ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రైతుల అవసరాలకు అనుసంధానించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బ్రిక్స్ సహకారం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువత, సామాన్య ప్రజలను భాగస్వాములుగా చేసుకోవాలని మోదీ అన్నారు. నైపుణ్యాలు, ఉపాధి, మహిళల భాగస్వామ్యం, సామాజిక భద్రతపై ‘BRICS Connect’, చిన్న పరిశ్రమలను మార్కెట్లు, ఆర్థిక వనరులు, జ్ఞానంతో కలిపే MSME సహకార పోర్టల్ వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.

పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధి

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధమైనవి కావని మోదీ స్పష్టం చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ, స్వచ్ఛ ఇంధన వ్యవస్థల కోసం బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, వ్యవసాయ జీవావరణ శాస్త్రం, పునరుత్పత్తి వ్యవసాయంపై సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి చర్యలను వివరించారు. బ్రిక్స్‌లో రూపొందే పరిష్కారాలు సభ్య దేశాలకే పరిమితం కాకుండా గ్లోబల్ సౌత్ అవసరాలకు కూడా అందుబాటులో ఉండాలని మోదీ అభిప్రాయపడ్డారు. వైవిధ్యమే బ్రిక్స్ బలం, సహకారమే పురోగతికి మార్గమని పేర్కొంటూ, ప్రపంచ మానవాళికి ఉపయోగపడే అభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>