కలం, వెబ్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rainfall) వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నెల్లికుదురు మండలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా స్థానిక చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. రావిరాల వద్ద ఉన్న లో-లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు వేగంగా పారుతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు నెల్లికుదురు నుంచి తొర్రూరు వెళ్లే మార్గంలో జరుగుతున్న పైప్‌లైన్ పనులు, రోడ్డు మరమ్మతుల వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు
జిల్లాలోని జామందుల్లపల్లి వద్ద మున్నేరు వాగు భయంకరమైన ఉధృతితో ప్రవహిస్తోంది. వరంగల్, నర్సంపేట, పాకాల అటవీ ప్రాంతాల్లో రాత్రంతా కురిసిన వానలతో ఈ వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ సీజన్‌లో మున్నేరుకు ఇదే మొదటి ప్రధాన వరద ఉధృతి కావడం గమనార్హం. నర్సంపేట వద్ద జన్మించే ఈ వాగు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల మీదుగా సాగి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నదిలో కలుస్తుంది.
వరద నీరు రోడ్లపైకి చేరుతుండటంతో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, లో-లెవెల్ వంతెనలను దాటేందుకు ఎవరూ సాహసించవద్దని హెచ్చరించారు.

