కలం, వెబ్ డెస్క్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price) భారీగా పెరగనున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఇంధన ధరలను పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని, ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని అధికారికంగా వెల్లడించింది.
అంతేకాకుండా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా స్థిరంగా కొనసాగిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ఈ సందర్భంగా కేంద్రం గుర్తు చేసింది. వినియోగదారులపై అదనపు భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ఈ వివరణతో గత కొద్ది రోజులుగా వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడినట్లయింది.

