కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లావ్యాప్తంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ముఖ్య పట్టణాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. రెండు రోజులుగా ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా జిల్లాలోని పలు పెట్రోల్ బంకులు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి స్టాక్ కోసం వాహనదారులు ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో యుద్ధ ప్రభావం వల్ల పెట్రోల్ (Petrol) కొరత వదంతుల కారణంగా భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో క్యాన్లు, టిన్నులతో ప్రత్యక్షమవుతున్న కూలీలను చూసి భయపడిపోతున్నారు. క్యాన్లలో పెట్రోల్ నిల్వ చేసుకుంటున్నారనే అపోహలతో అవసరం లేకపోయిన కొంతమంది ఫుల్ ట్యాంక్ చేస్తుండటం గమనార్హం.
డీజిల్ కొరత కారణంగా రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆటోలు, లారీలు, ఇతర భారీ వాహనాలు బంకుల వద్దే నిలిచిపోయాయి. పలు చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో అంతరాష్ట్ర ప్రయాణికులు, అత్యవసర పనులపై వెళ్లేవారు మార్గమధ్యలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెట్రోల్ బంకు యజమానులు మాత్రం.. సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయి. కానీ క్యూలైన్ ఎక్కువ ఉండటం వలన ఆలస్యమవుతుందని చెప్తున్నారు. సరఫరాలో అంతరాయం వల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం, తెరిచి ఉన్న బంకుల్లో భారీగా లైన్లు ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
కృత్రిమ కొరతను నివారించడానికి పౌర సరఫరా అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. సరఫరాను క్రమబద్ధీకరించి, అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇంధన కొరతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఓ స్పష్టమైన ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే వదంతులనే నమ్మే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే పెట్రోల్ కొరతపై ఒక ప్రకటన విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

