కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవల కులాలను టార్గెట్ చేస్తూ రాజకీయ విమర్శలు తీవ్రమవుతున్నాయి. గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఘటనతో మొదలైన ఈ పరంపర మరిన్ని నియోజకవర్గాలకు విస్తరించి తీవ్ర రూపం దాల్చుతోంది. అలాగే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఏపీలో కుల రాజకీయాలు రూపుమాపాలని, అప్పుడే ఏపీలో పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు. దీంతో పాటు వైసీపీ నేతలను రౌడీలుగా సంబోధిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై వైసీపీ ముఖ్య నేతలంతా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
పవన్ రాజకీయంగా పడిపోతున్నారని, జనసేన కార్యకర్తలు, నాయకులు కూడా పవన్‌ను పట్టించుకోవడం లేదని నాని అన్నారు. అందుకే పవన్ సరికొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని చెప్పారు. ముందు జగన్‌ను, వైసీపీ నేతలను నోటికొచ్చినట్లు తిట్టి రెచ్చగొడుతున్నాడని చెప్పారు. వైసీపీ శ్రేణులు ఆగ్రహంతో పవన్ పై ఎదురుదాడి చేస్తే జనసేన కార్యకర్తల వద్ద సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని అన్నారు. హామీలు, అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఇలా డైవర్షన్ రాజకీయాలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు అందుకే ఇక నుంచి వైసీపీ శ్రేణులు పవన్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవద్దని, ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.

