కలం, వరంగల్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) మృతిపై ఆయన సతీమణి పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంత్యక్రియల సందర్భంగా నర్సంపేటకు చెందిన శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్ యజమాని వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశిస్తూ, “నా భర్త మృతికి మీరే కారణం… నా భర్తను పొట్టన పెట్టుకుంది మీరే” అంటూ కన్నీరుమున్నీరయ్యారు. తన భర్త ఎదుర్కొన్న పరిస్థితులకు వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబమే కారణమంటూ ఆమె ఆరోపణలు చేశారు. భావోద్వేగంతో గుండెలు బాదుకుంటూ విలపించిన స్వప్నను కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు ఓదార్చారు.
ఇదిలా ఉండగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆర్థిక ఆరోపణలు చేస్తూ నర్సంపేటలో దీక్ష చేపట్టిన విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో తవ్వించిన బోర్‌వెల్స్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించలేదని వారు అప్పట్లో ఆరోపించారు. 2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బోర్‌వెల్స్ తవ్వించే పనులను శ్రీ లక్ష్మీ బోర్‌వెల్స్‌కు అప్పగించారని, ఆ పనులకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబం అప్పట్లో ఆరోపించింది.
ఈ అంశంపై వారు చేపట్టిన నిరసన 2023 ఎన్నికల సమయంలో రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నిరసన కారణంగానే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని పెద్ది స్వప్న భావిస్తున్నట్లు ఆమె వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. కాగా, పెద్ది స్వప్న చేసిన ఆరోపణలపై వీరమల్ల వెంకట్‌రెడ్డి కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

