ఆర్థరైటిస్‌ను జయించి CWG పతకం నెగ్గిన సీమ!

కలం, స్పోర్ట్స్ :  ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు.. ఎన్నో సవాళ్లను అధిగమించి భారత జావెలిన్ త్రోయర్ సీమ కలిరామ్నా (Seema Kaliramna) అద్భుత విజయాన్ని అందుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 58.65 మీటర్ల దూరం జావెలిన్ విసిరి కాంస్య పతకాన్ని సాధించి దేశం గర్వించేలా చేసింది. 27 ఏళ్ల సీమకు చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి ఉంది. మాజీ ఆర్మీ ఉద్యోగి, బాస్కెట్‌బాల్, జావెలిన్ త్రో క్రీడాకారుడైన తండ్రి ప్రోత్సాహంతో ఆమె క్రీడా ప్రయాణం ప్రారంభమైంది. కెరీర్ ప్రారంభంలోనే 48.08 మీటర్ల అత్యుత్తమ రికార్డును నమోదు చేసింది.

అయితే 2022లో కుమారుడు రుద్రకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే ఆమె తీవ్ర ఆర్థరైటిస్ సమస్యకు గురైంది. శరీరంలోని కీళ్లన్నీ నొప్పులతో బాధపడేవి. కనీసం చిన్న వస్తువులు ఎత్తడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆమె క్రీడా కెరీర్ దాదాపు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ కఠిన సమయంలో భర్త, మాజీ జాతీయ ఛాంపియన్ రవీందర్ కలిరామ్నా ఆమెకు అండగా నిలిచారు. కోచ్‌గా మారి తిరిగి క్రీడలలోకి వచ్చేలా ప్రోత్సహించారు. వ్యాధికి పూర్తి పరిష్కారం లేకపోవడంతో ఆయుర్వేద పద్ధతులు, నియంత్రిత ఆహారం, క్రమమైన వ్యాయామంతో సీమ క్రమంగా కోలుకుంది.

ఇదే సమయంలో చౌదరి బన్సీలాల్ విశ్వవిద్యాలయంలో శారీరక విద్యలో పీహెచ్‌డీ చేస్తూ విజువలైజేషన్, పాజిటివ్ థింకింగ్ అంశాలపై పరిశోధన చేసింది. ఆత్మవిశ్వాసం, మానసిక బలం అథ్లెట్ల ప్రదర్శనపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసింది. 2024లో మళ్లీ పోటీలలోకి వచ్చిన సీమ తన ప్రతిభను నిరూపించింది. ఇటీవల జరిగిన ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో 59.73 మీటర్ల అత్యుత్తమ త్రో నమోదు చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే ముందు తన కుమారుడు “అమ్మా.. నాకు పతకం తీసుకురా” అని కోరాడని సీమ తెలిపింది. ఆ మాటలను గుర్తు పెట్టుకుని పోటీలో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సాధించింది. ఒకవైపు తల్లిగా బాధ్యతలు, మరోవైపు పీహెచ్‌డీ పరిశోధనలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే సీమ సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం క్రీడాకారులకు ఆదర్శంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>