కలం, స్పోర్ట్స్: శ్రీలంకపై ఘన విజయం.. ఆసియా కప్ (Asia Cup) కైవసం. కానీ ట్రోఫీ (Trophy) అందుకునే సమయంలో భారత మహిళల జట్టు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) నుంచి ట్రోఫీ తీసుకోలేదు. ఈ నిర్ణయం జట్టు ఒక్కటే తీసుకున్నది కాదని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సమష్టిగా తీసుకుందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev shukla) తాజాగా స్పష్టం చేశారు. నక్వీ కూడా దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.
దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. అనంతరం ట్రోఫీ అందించే కార్యక్రమంలో భారత జట్టు నక్వీ నుంచి కప్ తీసుకోలేదు. ఈ నిర్ణయంపై మండలి కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే వివరణ ఇచ్చారు. 2025 పహల్గామ్ ఘటన తర్వాత పరిస్థితులు మారాయని ఆయన పేర్కొన్నారు. బహుళ దేశాల టోర్నీల్లో పాకిస్థాన్‌తో ఆడటం ప్రభుత్వ విధానంలో భాగమే అయినా.. ప్రతి షరతును అంగీకరించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నక్వీతో సైకియా మాట్లాడిన దృశ్యాలపై కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. మ్యాచ్ సమయంలో అధికారులు కలవడం సాధారణ వృత్తిపరమైన వ్యవహారమేనని చెప్పారు. అందువల్ల ఆ భేటీపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాజా వ్యాఖ్యలతో మహిళల జట్టు ట్రోఫీ అందుకోకపోవడం వెనుక బీసీసీఐ సమష్టి నిర్ణయం ఉందన్న విషయం స్పష్టమైంది.

