కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో పీడీఎస్ బియ్యం (PDS Rice) అక్రమ రవాణా, అక్రమ నిల్వ, మళ్లింపును అరికట్టేందుకు పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు చేపట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, మళ్లించడం వల్ల పేద లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని అన్నారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించడం, నిల్వ చేయడం, ఇతర ప్రాంతాలకు తరలించడం, మళ్లించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. అక్రమ కార్యకలాపాల వెనుక ఉన్న నెట్వర్క్ను గుర్తించి ప్రధాన సూత్రధారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అక్రమ రవాణాకు సహకరిస్తున్న వ్యక్తులు, వాహనదారులు, నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాలు, సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు, అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పోలీస్, సివిల్ సప్లైస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీపీ ఆదేశించారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, సివిల్ సప్లైస్ అధికారులు కె. శ్రీనాథ్ (డీసీఎస్వో), సంతోష్ సింగ్ (డీటీ, పెద్దపల్లి), ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

