కలం, పెద్దపల్లి: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం మరియు ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ (Gaddam Vamsi Krishna) మాట్లాడుతూ… 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. కోట్లాది మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇప్పుడు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని మండిపడ్డారు.
సామాన్యుడిపై ఆర్థిక భారం..
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలు, రూపాయి విలువ క్షీణించడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారాయని ఎంపీ ధ్వజమెత్తారు. “ఒకప్పుడు డాలర్‌కు రూ.45 ఉన్న పరిస్థితి నుంచి నేడు రూపాయి విలువ బాగా పడిపోయింది. దీనివల్ల విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే సాధారణ కుటుంబాల పిల్లలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి పరిధి నుంచి దేశ అవసరాల కోసం భారీగా బొగ్గు రవాణా జరుగుతోందని, ఆ నిష్పత్తికి తగినట్లుగా స్థానిక రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం తక్షణమే నిధులు కేటాయించాలి’ అని కోరారు.
ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పోరాటం..
దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీఎస్‌ఎన్‌ఎల్, డీఆర్‌డీఓ వంటి ప్రభుత్వ రంగ, శాస్త్రీయ సంస్థల సామర్థ్యాన్ని పెంచి, వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై ప్రజల్లో వస్తున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా సమాధానం చెప్పాలన్నారు. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికేనని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వంశీకృష్ణ స్పష్టం చేశారు.

