Mobile Popup Ad
Mobile Popup Ad

హరీష్ రావు ​ ఆ ప్రాజెక్టును ATMలా వాడుకున్నారు: విజయ రమణారావు

కలం, కరీంనగర్ బ్యూరో: ​బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రతిరోజూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే (Peddapalli MLA) విజయ రమణారావు (Vijaya Ramana Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్ (Karimnagar) ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. ​

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద వైఫల్యం! అని పేర్కొన్నారు. ​గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయ రమణారావు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట జరిగిన అవినీతిని ఎండగట్టారు. ​”కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి–చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం రెండేళ్లకే దెబ్బతినడం వారి వైఫల్యానికి నిదర్శనం. పారే నీటిని మళ్లీ అదే నదిలోకి ఎత్తిపోసే వింత ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్న హరీష్ రావు.. అది ఎందుకు దెబ్బతిందో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని అన్నారు.

​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని, దేశంలోనే అత్యధికంగా వరి, మొక్కజొన్న సాగు నమోదైందని ఆయన గుర్తుచేశారు. ​రైతు సంక్షేమంలో కాంగ్రెస్ మార్క్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని విజయ రమణారావు గణాంకాలతో సహా వివరించారు. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఒకే రోజు 54.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో (మూడు ఎకరాల వరకు) నిధులు జమ చేసినట్లు తెలిపారు.

​బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు కింద రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రైతు భరోసా కింద రూ.30 వేల కోట్లు విడుదల చేసింది. ఎన్నికలకు ముందు పెండింగ్‌లో ఉన్న రూ.7 వేల కోట్ల బకాయిలను చెల్లించడంతో పాటు, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు విడుదల చేశామన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించామని తెలిపారు.

కేంద్రం కొనుగోలు చేయని మొక్కజొన్నలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని అన్నారు. ​రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ అరాచక పాలన నుంచి బయటపడి ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజాదరణను తట్టుకోలేకే బీఆర్ఎస్ బురదజల్లే రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాల్లో భాగంగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు విజయ రమణారావు వెల్లడించారు. ​ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>