కలం, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) పరిసర ప్రాంతాలలో ఎలుగుబంటి సంచారం (Bear Movement) స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. చిగిచెర్ల, చింతలపల్లి గ్రామాల సమీపంలోని పొలాలు, రహదారులపై ఎలుగుబంటి సంచరిస్తుండటంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎలుగుబంటి కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలుగుబంటి గ్రామాల సమీపంలో తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలోకి తరలించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

