పెద్దపల్లి జిల్లాలో ‘అక్రమ లేఅవుట్ల దందా’

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లాలో గత రెండేళ్లుగా మందకొడిగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటున్న తరుణంలో అక్రమ లేఅవుట్ల దందా (Illegal Real Estate Layouts) తీవ్రరూపం దాల్చింది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లితో పాటు వివిధ పట్టణాల శివారు ప్రాంతాల్లో రియల్టర్లు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి కొత్త వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. అధికారుల ఉదాసీనత, నజరానాల మత్తు లీలలతో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి.

కమ్యూనిటీ స్థలాలు సైతం విక్రయం

సాధారణంగా ప్రభుత్వం ఆమోదించిన లేఅవుట్లలో 30, 40 అడుగుల రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్లతో పాటు పాఠశాలలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్ల వంటి సామాజిక అవసరాల కోసం 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు గిఫ్ట్ డీడ్ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలోని రియల్టర్లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, అంగుళం స్థలం కూడా వదలకుండా విక్రయిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి ప్రాంతంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 170 నుండి 180 ప్లాట్లతో రెండు కొత్త వెంచర్లను ఏర్పాటు చేశారు. 30, 40 అడుగుల రోడ్లు వేసినప్పటికీ, డీటీసీపీ అనుమతులు గానీ, కమ్యూనిటీ స్థలాల కేటాయింపు గానీ చేయలేదు. నిబంధనలను తోసిపుచ్చి గజానికి రూ.13,000 నుండి రూ.15,000 చొప్పున అమ్ముతూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఈ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.

కొనుగోలుదారులకు ‘ఎల్ఆర్ఎస్’ దెబ్బ

వెంచర్లలో రోడ్లు బాగున్నాయనే ఉద్దేశంతో కొనుగోలుదారులు డీటీసీపీ అనుమతుల గురించి ఆరా తీయకుండా ప్లాట్లు కొంటున్నారు. జిల్లా (Peddapalli) ఏర్పడినప్పటి నుండి వేసిన వందలాది వెంచర్లలో డీటీసీపీ అనుమతి ఉన్నవి పది కూడా దాటకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీరా ఇల్లు కట్టుకుందామని వెళ్తే పంచాయతీ, మున్సిపల్ అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద వేలాది రూపాయల రుసుం చెల్లిస్తే తప్ప ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపడం లేదు. రియల్టర్ల లాభాపేక్షకు అమాయక ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.

చర్యలకు ప్రజా సంఘాల డిమాండ్

కళ్లెదుటే ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు అక్రమ వెంచర్లుగా మారుతున్నా పంచాయతీ, మున్సిపల్, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంచర్లు ప్రారంభంలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన యంత్రాంగం మౌనం వహిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, అనుమతులు లేని అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>