కలం, నల్లగొండ: ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని ఘనంగా జయప్రదం చేయాలని సీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) పిలుపునిచ్చారు. “భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం” సాగిన వీరోచిత సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ వహించిన పాత్ర చారిత్రాత్మకమైనదని ఆయన కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట చారిత్రక కేంద్రమైన నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామంలో ఈ నెల 11న సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్సీ తెలిపారు.
ఈ సందర్భంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామంలోని వీర తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద ఎర్రజెండాలను ఎగురవేసి, ఘనంగా నివాళులర్పించాలని కోరారు. అలాగే, 17వ తేదీన హైదరాబాద్లో భారీ ముగింపు సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో భూస్వాములు, దొరల అరాచకాలకు, నైజాం భూస్వామ్య గడిల పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో సాగిన సాయుధ పోరాటమే వేలాది గ్రామాలకు విముక్తి కలిగించిందని నెల్లికంటి సత్యం గుర్తుచేశారు. ఈ పోరాట ఫలితంగానే నాడు భూమి లేని పేదలకు ఏకంగా 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే దక్కుతుందన్నారు. వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, సాయుధ పోరాట ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

