అక్రమ వసూళ్లపై కలెక్టరేట్ ముట్టడికి హెచ్చరిక

కలం, పెద్దపల్లి: ఎన్టీపీసీ ఉచితంగా అందించే బూడిదను తరలించే లారీల నుంచి ఎలాంటి జీవో, సర్క్యులర్ లేకుండానే జిల్లా కలెక్టర్ రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ (Korukanti Chander) ఆరోపించారు. ఈ వసూళ్లతో లారీ యజమానులను దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత మూడేళ్లలో అధికారికంగానే 1.24 లక్షల ట్రిప్పుల ద్వారా సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేశారని, ఇందుకు ఎలాంటి రసీదులు కూడా ఇవ్వలేదని చందర్ ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 265 ప్రకారం ప్రభుత్వం ఏ పన్ను లేదా రుసుము వసూలు చేయాలన్నా చట్టబద్ధమైన జీవో ఉండాలని పేర్కొన్నారు. అయితే ఎవరి ఆదేశాల మేరకు కలెక్టర్ ఈ డబ్బులు వసూలు చేశారు, ఎవరి ఖజానాలోకి మళ్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే తరహాలో మట్టి తరలింపునకు క్యూబిక్ మీటర్‌కు రూ.40-50 వసూలు చేయాల్సి ఉండగా, ఏకంగా రూ.3,500 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో పేద లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

అధికార, అనధికారిక వసూళ్లు, పోలీసుల అక్రమ ఫైన్లు, నెలల తరబడి లారీలను సీజ్ చేయడంతో యజమానులు డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ బందిపోటు తరహాలో వ్యవహరిస్తూ లారీ యజమానులను దోచుకుంటున్నారని, జిల్లాలో చట్టం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని విమర్శించారు.

వసూలు చేసిన రూ.6 కోట్లను లారీ నంబర్ల ఆధారంగా సంబంధిత యజమానులకు తక్షణమే తిరిగి చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో ఈ అక్రమ వసూళ్లపై డీపీటీఓ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఈడీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా లారీలతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీరామ లారీ యాష్ టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె అశోక్, ముత్యం అనిల్ గౌడ్, రాము గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్ కుమార్, నారాయణదాసు మారుతి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>