కలం, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ (Nalgonda Municipal) కార్పొరేషన్లో ఇటీవల సంచలనం రేపిన అక్రమ కారుణ్య నియామకం, నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారం కమిషనర్ వంశీకృష్ణ మెడకు చుట్టుకుంది. ఈ వివాదంలో ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు, కమిషనర్‌పై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డికి నల్లగొండ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకున్న అక్రమ కారుణ్య నియామకం, నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో కొందరు మున్సిపల్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ కేసులో అసలు బాధ్యులతో పాటు సంబంధం లేని మరికొందరు సిబ్బందిని కూడా కమిషనర్ వంశీకృష్ణ అన్యాయంగా ఇరికించారనే విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనల ప్రకారం బాధ్యులపై శాఖాపరమైన (డిపార్ట్మెంటల్) విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, కమిషనర్ ఈ వ్యవహారాన్ని ఏకంగా క్రిమినల్ కేసుల వరకు తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని రచ్చకెక్కించి, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టను బజారుకీడ్చారని ఉన్నతాధికారులు వంశీకృష్ణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా వంశీకృష్ణను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన ఇన్ఛార్జ్ కమిషనర్‌గా నియమితులైన శ్రీజారెడ్డి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

