కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంపై తనకున్న నిబద్ధత నిన్నమొన్నటిది కాదని, అది తన సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే తాను తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచానని ఆయన గుర్తుచేశారు. ఆయన ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) లో స్పందించారు.
2009లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు, ప్రజా గాయకుడు గద్దర్ గారితో కలిసి తాను ‘తెలంగాణ సామాజిక న్యాయ సభ’లో పాల్గొన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిందని, అయినప్పటికీ తాను వెనకడుగు వేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు పలికానని చెప్పారు. కేవలం ప్రత్యేక రాష్ట్రం మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు పునాదిగా ఉండే ‘సామాజిక తెలంగాణ’ కావాలని తాము పిలుపునిచ్చినట్లు ఆయన వివరించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఎప్పుడూ తెలంగాణకు మద్దతు ఇవ్వలేదని, ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించాలనే బలమైన నమ్మకంతోనే ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నాటి తన వైఖరి తెలంగాణ ప్రజల పట్ల తనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను మద్దతు తెలపడం అనేది రాజకీయం కాదు, అది తన నైతిక సూత్రమని జనసేనాని స్పష్టం చేశారు.

