ఫిఫా ఫైనల్‌లో అసలు విలన్ పిచ్చేనా..? టెన్షన్‌లో ఫైనలిస్టులు!

కలం, స్పోర్ట్స్ : ఫిఫా 2026 ప్రపంచకప్ ఫైనల్ (FIFA Final) పోరు అర్జెంటీనా-స్పెయిన్ మధ్య జరగనుంది. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచమంతా ఈ మ్యాచ్‌ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఈ ఫైనల్‌కు ముందు అందరి చూపు ఇప్పుడు బంతిపైనా కాదు… పిచ్‌పైనే ఉంది. న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియం పిచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫైనల్ ఫలితాన్ని కూడా ఇదే ప్రభావితం చేయొచ్చనే చర్చ నడుస్తోంది. ఈ స్టేడియంలో హైబ్రిడ్ గడ్డి పిచ్‌ను ఉపయోగిస్తున్నారు.

టోర్నీలో ఇక్కడ జరిగిన ఏడు మ్యాచ్‌ల తర్వాత ఆటగాళ్లు, కోచ్‌లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు పిచ్ చాలా వేగంగా, గట్టిగా ఉందన్నారు. మరికొందరు అసమానంగా అనిపించిందని చెప్పారు. ఇంకొందరు మాత్రం వర్షం పడిన తర్వాత పిచ్ నాణ్యత బాగా మెరుగైందని అభిప్రాయపడ్డారు. బంతి వేగంగా కదిలిందని, ఆట మరింత సాఫీగా సాగిందని వెల్లడించారు. ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా, స్పెయిన్ ఇప్పటివరకు ఈ స్టేడియంలో ఆడలేదు.

దీంతో ఫైనల్‌కు ముందు పిచ్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ మరింత పెరిగింది. ఇంగ్లండ్ కోచ్ థామస్ టుచెల్ పిచ్ చాలా వేగంగా ఉందని పేర్కొన్నాడు. చిన్న గడ్డి కారణంగా కృత్రిమ టర్ఫ్‌పై ఆడుతున్నట్లే అనిపించిందని అభిప్రాయపడ్డాడు. బ్రెజిల్ స్టార్ వినీషియస్ జూనియర్ మాత్రం ఈ పిచ్ ఆటకు అంతగా సహకరించడం లేదని భావించాడు. ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ అడ్రియన్ రాబియో కూడా పిచ్ చాలా గట్టిగా అనిపించిందని చెప్పాడు.

కోచ్ డిడియర్ డెషాంప్స్ కూడా ఇది ఆటగాళ్ల కండరాలపై ఎక్కువ భారం పడేలా చేసిందని అభిప్రాయపడ్డాడు. అయితే నార్వే కోచ్ స్టాలే సోల్బాకెన్ మాత్రం వర్షం తర్వాత పిచ్ చాలా మెరుగైందని వివరించాడు. తడి కారణంగా బంతి మరింత వేగంగా కదిలిందని, ఆట సాఫీగా సాగిందని తెలిపాడు. శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం మాత్రం ఎండ వాతావరణం ఉంటుందని అంచనా. వర్షం తడి పిచ్‌లో నిలిస్తే ఫైనల్‌లో బంతి వేగంగా కదిలే అవకాశం ఉంది.

ఫిఫా మాత్రం పిచ్ నిర్వహణపై పూర్తి నమ్మకంతో ఉంది. సహజ గడ్డితో పాటు సింథటిక్ ఫైబర్లతో ఈ హైబ్రిడ్ పిచ్‌ను సిద్ధం చేశారు. టోర్నీ మొత్తం తేమ, గట్టితనం, ఆటకు అనుకూల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించినట్లు తెలిపింది. అలాగే ఫైనల్‌కు ముందు మైదానం పూర్తిగా కోలుకునేలా చివరి మ్యాచ్ తర్వాత 13 రోజుల విరామం కూడా ఇచ్చింది. బంతిని ఎక్కువగా తమ ఆధీనంలో ఉంచి ఆడే అర్జెంటీనా, స్పెయిన్ జట్లకు పిచ్ పరిస్థితి కీలకం కానుంది. ఆదివారం వాతావరణం ఎలా ఉంటుందో… అదే ఫైనల్ ఆట తీరును కూడా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>