కలం, మెదక్ బ్యూరో: కులమతాలకు అతీతంగా అందరూ సమానమేనని చాటే అయ్యప్ప దీక్షలోనూ కులవివక్ష (Caste Discrimination) చోటుచేసుకుందనే ఆరోపణలు సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో కలకలం రేపుతున్నాయి. అయ్యప్ప మాలధారణ చేసిన దళిత స్వాముల రాకతో సన్నిధానం అపవిత్రమైందంటూ అగ్రవర్ణాలకు చెందిన స్వాములు మరోచోటికి మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా శివాలయంలో కొనసాగుతున్న అయ్యప్ప సన్నిధానాన్ని విడిచిపెట్టి మరోచోట పూజలు నిర్వహించడంపై దళిత అయ్యప్ప స్వాములు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా అయ్యప్ప మాలధారణ చేస్తున్నామని నెల రోజుల ముందుగానే తెలియజేసినప్పటికీ ఈ పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు.
అయ్యప్ప దీక్షలో కులవివక్షకు తావులేదని, మాలధారణ చేసిన ప్రతి ఒక్కరూ స్వాములేనని వారు పేర్కొంటున్నారు. సన్నిధానం మారినంత మాత్రాన శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి మారుతారా? ఏఐ యుగంలోనూ కులవివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ములుగులో అయ్యప్ప స్వాముల మధ్య నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

