కలం, వెబ్ డెస్క్: తమ పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను జనసేన నియమించింది. జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో “జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను” నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే లక్ష్యంగా నియామకం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకులకు తగిన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలని.. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించి పార్టీ అధ్యక్షుల వారి పరిశీలనకు ఈ కమిటీలు సమర్పించనున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతిఏటా క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి 7 మంది ప్రధాన సభ్యులతో పాటు, వారితో సమన్వయం చేస్తూ పనిచేసే 21 మంది సాధకులతో ఈ కమిటీ ఉంటుంది. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులను నియమించారు. అలాగే ఈ కమిటీలలో మహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

