కలం, మెదక్ బ్యూరో : జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పటాన్‌చెరులోని తన నివాసంలో స్వీయ జనగణన (Self Enumeration)లో భాగంగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన (Mahipal Reddy) మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి జనగణన కీలకమని, ఖచ్చితమైన వివరాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో జనగణన ప్రక్రియ మరింత సులభమైందని తెలిపారు.
ప్రజలను యాప్ ద్వారా స్వీయ జనగణన చేయమని ప్రోత్సాహించారు. ప్రభుత్వ అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందించాలని.. ఎటువంటి గోప్యతకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల జీవన స్థాయి, వెనుకబాటుతనం, విద్య స్థాయి వంటి అంశాలపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని చెప్పారు. ప్రజలు అందించే ప్రతి సమాచారం పూర్తి భద్రతతో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఏఆర్ఓ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

