Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రాణహిత చేవెళ్లపై ఉత్తమ్ క్లారిటీ: త్వరలోనే తుది నిర్ణయం!

కలం, వెబ్‌ డెస్క్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా భగీరథ ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. కుందన్ బాగ్ లోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

తుమ్మిడిహట్టి నుండి ఎల్లంపల్లికి నీటిని తరలించే అంశంపై ఆర్వీ అసోసియేట్స్ తో పాటు ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులు నాలుగు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో అయ్యే ఖర్చు, లాభనష్టాలపై ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సాయంత్రం జరగబోయే ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులను వర్షాకాలం ప్రారంభం లోపే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ప్రతి 1.5 మీటర్ల దూరంలో ఎస్పీటీ టెస్టులు, ప్రతి మూడు మీటర్లకు పెర్మిబిలిటీ టెస్టులు నిర్వహించాలని స్పష్టం చేశారు. బోర్లు వేసే క్రమంలో రాయి తగిలినా సరే ఐదు మీటర్ల లోతు వరకు తవ్వాల్సిందేనని చెప్పారు.

బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి పనులకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిని ఖరారు చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ డైరెక్టర్ స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. పునరుద్ధరణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఎన్డీఎస్ఏకు నివేదించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>