కలం, ఖమ్మం బ్యూరో : పదవుల కోసం కాకుండా నిత్యం జనం కోసం, నిరుద్యోగుల కోసం పనిచేసే వారికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) ఓటు వేసి గెలిపించాలని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ (Palakuri Ashok) పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే ఎమ్మెల్సీ అభ్యర్థులకు పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
గత 12 ఏళ్లుగా నిరుద్యోగులకు నిధులు, నియామకాలు లేక తీవ్ర అన్యాయం జరిగిందని, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని విమర్శించారు. గ్రూప్-1, 2, 3 ఉద్యోగాల ప్రకటన ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ, పవర్ సెక్టార్‌లోని 5,300 పోస్టుల భర్తీకి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని స్పష్టం చేశారు.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) 30 వేల మొదటి ప్రాధాన్యత, 90 వేల రెండో ప్రాధాన్యత ఓట్లతో ప్రధాన పార్టీలకు ముచ్చమటలు పట్టించానని, బీఆర్‌ఎస్ ఓటమికి తానే కారణమయ్యానని గుర్తుచేస్తూ, ఈసారి ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కాదని కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి తెలంగాణ పీసీసీని ‘రెడ్డి కాంగ్రెస్’గా మార్చిందని, బీఆర్ఎస్ కూడా ఓసీలకే టికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం స్థానాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని, 10 శాతం లేని ఓసీలు 70 శాతం అసెంబ్లీని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా నిరుద్యోగుల కోసం, తెలంగాణ సమాజం కోసం పోరాడటం వల్లే తనపై 18 కేసులు పెట్టారని, మూడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేశానని, లక్షలాది మందికి ఉచితంగా పాఠాలు బోధించానని తెలిపారు.
నాన్-లోకల్స్ కబ్జాలో ఉన్న ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలకు అందించడమే తన ప్రధాన ఎన్నికల నినాదమని స్పష్టం చేశారు. భౌగోళిక తెలంగాణ వచ్చినా ఉన్నత కులాల చేతుల్లో బందీ అయిన సామాజిక తెలంగాణను సాధించుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఐక్యమై ఓటు రూపంలో చైతన్యం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టిస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.వి.గౌడ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు బానోతు భద్రు నాయక్, నాగరాజు, జి.వెంకటనారాయణ, ప్రణీత్, కృష్ణ, బి.రమేష్, డి.ఉదయ్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : హరీశ్ రావు పరువు నష్టం కేసు.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు!
Follow Us On : WhatsApp

