కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో (Pakala Beach) చోటుచేసుకున్న విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సముద్రంలో గల్లంతైన యువకులలో దేవండ్ల విష్ణు (16) మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికితీసింది. కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు పోలేరమ్మ కొలుపుల అనంతరం సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
ఒక్కసారిగా ఎగసిపడిన రాకాసి అల్లకల్లోలం సృష్టించడంతో నలుగురు సముద్రంలో కొట్టుకుపోయారు. ఈ దుర్ఘటనలో ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు కలిసి నిన్నటి రోజున రెండు మృతదేహాలను వెలికితీయగా, నేడు మరో మృతదేహం లభ్యమైంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టాయి.
కాగా, సముద్రంలో గల్లంతైన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకే గ్రామానికి చెందిన యువకులు సముద్ర స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలలో, శ్రీరంగాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

