కలం, వెబ్ డెస్క్: నీట్(యూజీ)–2026 (NEET) పరీక్ష రద్దు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ఈ పరీక్ష పేపర్ రాజస్థాన్ రాష్ట్రంలో లీక్ అయిన నేపథ్యంలో.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆమోదం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త తేదీలు, కొత్త అడ్మిట కార్డుల షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది. రాజస్థాన్‌లోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు 48 గంటల ముందు నిర్వహించిన కెమిస్ట్రీ ప్రాక్టీస్ పేపర్‌లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో, పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రాక్టీస్ పేపర్‌లోని ఆప్షన్లు, ఒరిజినల్ పేపర్‌లోని ఆప్షన్లు కూడా ఒకేలా ఉండటం గమనార్హం.
సీబీఐ విచారణకు ఆదేశాలు…
పరీక్ష పేపర్ లీకైన ఘటనను సీబీఐతో విచారణ చేయిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దర్యాప్తుకు అవసరమైన అన్ని పత్రాలు, రికార్డులు సీబీఐకి అందిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం, దర్యాప్తు సంస్థల నివేదికలను పరిశీలించినప్పుడు.. ఈ ప్రక్రియను ఇంకా కొనసాగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. పునఃపరీక్ష వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలకు గణనీయమైన ఇబ్బందులు కలుగుతాయని తమకు తెలిసినా.. పరీక్షను అలాగే కొనసాగించడం వలన ఇంకా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కొత్తగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు..
కొత్తగా నిర్వహించే పరీక్ష కోసం మళ్లీ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రాల ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. అలాగే, అదనపు పరీక్ష ఫీజు కూడా వసూలు చేయబోమని.. ఇప్పటికే చెల్లించిన ఫీజులను విద్యార్థులకు తిరిగి చెల్లిస్తామని తెలిపింది. పునఃపరీక్షను NTA సొంత నిధులతోనే నిర్వహిస్తుందని వివరించింది.
విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని వార్తలను నమ్మకుండా, NTA అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరింది.

