కలం, జగిత్యాల: సౌదీ అరేబియా (Saudi Arabia) లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల (Jagtial) జిల్లా అనంతారం గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడి (Gulf Worker) కుటుంబానికి పరిహారం అందేలా న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రవాస భారతీయ (NRI) వ్యాపారవేత్త ఆకునూరి శంకర్ ఆర్థిక సహాయం అందించారు. కోర్టులో పరిహారం కేసు దాఖలు చేయడంతో పాటు అవసరమైన ధ్రువపత్రాల అటెస్టేషన్, ఇతర న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.40 వేల చెక్కును మృతుడి భార్య పూజారాణికి అందజేశారు. అనంతారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రం మహేష్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. సౌదీకి వెళ్లిన 45 రోజులకే, 2023 జూలై 6న అల్ హసా, హొఫూఫ్ ప్రాంతంలో సైకిల్ పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మహేష్ మృతి చెందారు.
మహేష్ మృతి అనంతరం కుటుంబానికి రావాల్సిన పరిహారం కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సహాయం కోరుతూ ఆయన భార్య పూజారాణి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎన్నారై వ్యాపారవేత్త ఆకునూరి శంకర్ స్పందించి, పరిహారం కేసు దాఖలు ప్రక్రియకు అవసరమైన ఖర్చుల కోసం రూ.40 వేల ఆర్థిక సహాయం అందించారు. మహేష్ కుటుంబానికి న్యాయం జరిగేలా పరిహారం కేసు ప్రక్రియలో అవసరమైన సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డా. బి.ఎం.వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ కర్రి పద్మారాణి, జీఏడీ అధికారి ఇ.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

