కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది (NREGS employees)కి పేస్కేల్‌ను తక్షణమే అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని వీవీబీజీ–రామ్‌జ్ స్కీమ్ కింద పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెల ఒకటో తేదీన క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించడంతో పాటు, పదోన్నతులు, బదిలీల విషయంలో స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత నాలుగు రోజులుగా పెన్‌డౌన్, నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సిబ్బంది, భూత్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది, పెండింగ్ వేతనాల విడుదల, పేస్కేల్ అమలు, క్రమబద్ధమైన వేతనాల చెల్లింపు, పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, కో-చైర్మన్ విజయభాస్కర్, ఏపీఓ విమల, ఈసీ శ్రీనివాసులు, టీఏలు, ఆపరేటర్లు, ఈసీలు, సీఓలు ఇతర సిబ్బంది, పాల్గొన్నారు.

