చేయని తప్పుకు బ్యాంక్ ఖాతా ఫ్రీజ్.. పెన్షన్ కోసం ఎదురుచూస్తూనే వితంతువు మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: అది ఆమెకు జీవనాధారం.. అనారోగ్యానికి ఆసరా. కానీ అధికారుల నిర్లక్ష్యం, నిబంధనల పేరిట విరుచుకుపడ్డ ‘బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్’ నిర్ణయం ఒక నిరుపేద మహిళ ప్రాణాన్నే బలితీసుకుంది. పింఛన్ డబ్బులు చేతికి అందక, అవసరమైన మందులు కొనుగోలు చేయలేక ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని (Chinthakani) మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన కర్రి అనసూయ (53) అనే వితంతువు దయనీయ స్థితిలో మృతి చెందారు.

​గ్రామానికి చెందిన అనసూయ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పింఛనే ఆమెకు ఏకైక ఆధారం. ఆ డబ్బులతోనే ఆమె క్రమం తప్పకుండా మందులు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్థానిక మహిళా సంఘంలో ఆమె ఎలాంటి రుణం తీసుకోలేదు, వాయిదాల బాకీ కూడా లేరు. అయినప్పటికీ ఇతర సభ్యులు బకాయి పడ్డారనే నెపంతో అధికారులు నాలుగు నెలల క్రితం గుంపగుత్తగా అందరి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ​

ఫలితంగా గత నాలుగు నెలలుగా అనసూయ పింఛన్ డబ్బులు బ్యాంకులోనే నిలిచిపోయాయి. “నేను రూపాయి అప్పు తీసుకోలేదు, మందులు లేక ప్రాణం పోయేలా ఉంది.. నా పింఛన్ నాకిప్పించండి” అని బాధితురాలు అధికారుల చుట్టూ తిరుగుతూ వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో, నాలుగు నెలలుగా సరైన వైద్యం, మందులు అందక ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇంట్లోనే కన్నుమూశారు.

​చేయని తప్పుకు ఖాతా నిలిపివేసి తమ మనిషి ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల ఉదాసీనతే ఈ మరణానికి కారణమని, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>