రైతన్న ఫామ్‌ పాండ్ నిర్మించుకో.. జలసిరిని ఒడిసిపట్టుకో!

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల ప్రతి ఏటా అన్నదాతలు విలువైన పంటలను నష్టపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వ్యవసాయాధికారులు పొలాల్లో ‘ఫామ్‌ పాండ్‌’ (Farm Ponds-వ్యవసాయ కుంటలు)ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నా, సరైన అవగాహన లేకపోవడంతో చాలామంది వీటికి దూరంగా ఉంటున్నారు. వర్షపు నీటి సంరక్షణ ద్వారా కరువు ఛాయలను తరిమికొట్టడంలో ఈ కుంటలు కీలకంగా మారుతున్నాయి.

ఫామ్‌ పాండ్‌ల నిర్మాణం వల్ల రైతులకు ఆర్థికంగా మాత్రమే కాకుండా.. సాగుపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకాశం నుంచి పడే ప్రతి చుక్కనూ ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇక వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా వర్షాలు ఆలస్యమైనప్పుడు ఈ కుంటలలో నిల్వ ఉన్న నీటిని ‘లైఫ్ సేవింగ్ ఇరిగేషన్’ (జీవనాధార తడి) కింద పంటలకు మళ్లించి ఎండిపోతున్న పైరును కాపాడుకోవచ్చు. దీనివల్ల మధ్యలోనే పంట దెబ్బతినే ప్రమాదం తప్పుతుంది. అంతేకాకుండా ఈ కుంటల్లో చేపల పెంపకం చేపట్టడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరి ఆర్థిక భద్రత లభిస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతులను ప్రోత్సహించేందుకు ఫామ్‌ పాండ్ల నిర్మాణానికి సబ్సిడీలను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఇటు ప్రకృతి కరుణించక, అటు నీటి వనరులు అందక సతమతమయ్యే ప్రతి రైతు స్వయంసమృద్ధి సాధించాలంటే పొలంలో ఒక కుంటను తవ్వుకోవడం ఎంతైనా అవసరం. వ్యవసాయాధికారులు ఇస్తున్న సూచనలను పాటిస్తూ, ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు జలసిరిని ఒడిసిపట్టి లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>