డెంగ్యూ వ్యాధికి చెక్: భారత్‌లోకి తొలి వ్యాక్సిన్ ‘క్యూడెంగా’!

కలం, నేషనల్ డెస్క్ : ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ జ్వరం ప్రజల్ని పీడిస్తోంది. దీంతో దేశాన్ని వణికించే డెంగ్యూ మహమ్మారిని అరికట్టేందుకు కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ (Dengue Vaccine) ‘క్యూడెంగా’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘టకెడా ఫార్మాస్యూటికల్’తో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ వ్యూహాత్మక పంపిణీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం.. 2027 ప్రథమార్ధంలో ఈ వ్యాక్సిన్ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారత డ్రగ్స్ నియంత్రణ సంస్థ ఈ వ్యాక్సిన్‌కు అధికారికంగా ఆమోదం తెలిపింది.

రక్తపరీక్షలు అవసరం లేదు

టకెడా సంస్థ అభివృద్ధి చేసిన ఈ క్యూడెంగా వ్యాక్సిన్‌ను నాలుగేళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు. దీనిని 0.5 ఎంఎల్ చొప్పున రెండు ఇంజెక్షన్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ తీసుకున్న మూడు నెలల తర్వాత రెండో డోస్ ఇస్తారు. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా నేరుగా ఇవ్వవచ్చు. వ్యాక్సిన్ వేయించుకునే ముందు ఎటువంటి ముందస్తు రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు.

ప్రభావం ఎంత?

క్లినికల్ ట్రయల్స్ డేటా ఆధారంగా ఈ వ్యాక్సిన్.. నాలుగు రకాల డెంగ్యూ వైరస్ (సెరోటైప్స్‌)పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి డోస్‌ తీసుకున్న ఏడాది తర్వాత డెంగ్యూ ఇన్ఫెక్షన్‌ సోకకుండా 80.2 శాతం రక్షణ కల్పించింది. అంతేకాదు రెండో డోస్‌ తీసుకున్న 18 నెలల తర్వాత నిర్వహించిన పరిశోధనల్లో డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితులను నివారించడంలో 90.4 శాతం సామర్థ్యాన్ని చూపించింది.

భారత్‌కు డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు అవసరం?

గడిచిన రెండు దశాబ్దాలుగా దేశంలో డెంగ్యూ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో, ఆ తర్వాత వచ్చే సీజనల్ అవుట్‌బ్రేక్స్ వల్ల దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్య వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతున్నది. ‘నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్’ తాత్కాలిక గణాంకాల ప్రకారం.. 2025 ఒక్క ఏడాదిలోనే దేశంలో 1,13,450 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రానున్న క్యూడెంగా వ్యాక్సిన్ దేశానికి ఒక అదనపు రక్షణ కవచంలా మారనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టకెడా సంస్థ 2030 నాటికి ఏటా 10 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>