సంగారెడ్డి క‌లెక్ట‌రేట్‌లో కనిపించని మంచినీటి వసతి!

క‌లం, మెద‌క్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy)జిల్లాలో ఏప్రిల్ నెల‌లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద‌యం తొమ్మిది గంటలు నుండే ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే వివిధ ప‌నుల‌మీద ప్ర‌భుత్వ ఆఫీసుల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు కనీస తాగునీటి సదుపాయం క‌ల్పించ‌డం లేదు అధికారులు. ఇది ఏదో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే… సాక్ష‌త్తూ జిల్లా ప‌రిపాల‌న కేంద్ర‌మైన సంగారెడ్డి క‌లెక్ట‌రేట్ (Sangareddy Collectorate) కార్యాలయంలోనే ప్ర‌జ‌ల‌కు తాగునీటి వసతి కరువైంది. దీంతో సంగారెడ్డి క‌లెక్ట‌రేట్ కు ప‌నుల కోసం వచ్చే ప్ర‌జ‌లు, కిందిస్ధాయి ఉద్యోగులు తాగునీటి సౌక‌ర్యం లేక ఇబ్బందులు ప‌డుతున్నారు.

పేరుకే ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్…

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం. ఈ ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ లోనే సుమారు 50 కి పైగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల‌కు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. ఈ ఆఫీసుల‌కు రోజూ వందలాది మంది ప్రజలు వేరే ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం కావ‌డంతో , పెద్దఎత్తున‌ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఉండ‌టంతో సంగారెడ్డి క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం ప్ర‌జ‌లు, ఉద్యోగులు , అధికారుల‌తో సంద‌డిగా ఉంటుంది. ప్ర‌తి సోమవారం ప్ర‌జల స‌మ‌స్య‌ల‌ను, ఫిర్యాదుల‌ను స్వీక‌రించే ప్రజావాణి కార్యక్రమానికి దాదాపు వంద‌ల సంఖ్య‌లో జిల్లాలోని నార‌య‌ణ ఖేడ్ , జ‌హీరాబాద్ , అందోల్ ప్రాంతాల నుండి వస్తుంటారు. సుదూర ప్రాంతాల నుండి వ‌చ్చి త‌మ స‌మ‌స్య‌ల‌ను అధికారులుకు చెప్ప‌కునే వారికి గుప్పెడు తాగునీటి సౌక‌ర్యం కుడా లేని ప‌రిస్ధితి నెల‌కొంది. నిత్యం క‌లెక్ట‌రేట్ కేంద్రంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం చేసే జిల్లా అధికారులు తమ జిల్లా కేంద్ర కార్యాల‌యాలు ఉండే ప్రాంతంలోనే ప్ర‌జ‌ల కోసం మంచినీటి వసతి కుడా క‌ల్పించ‌లేక‌పోతున్నారు.

ప‌ని చేయ‌ని వాట‌ర్ ఫిల్ట‌ర్

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ‌త 15 రోజులుగా ఎండ‌ల తీవ్ర‌త పెరుగుతోంది. జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద‌వుతున్నాయి. దాదాపుగా జిల్లాలో 45 డిగ్రీలు వ‌ర‌కు న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు తొమ్మిది గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు బ‌యటకు రాని పరిస్ధితి నెల‌కొంది. ఎండ తీవ్రత , ఉక్కపోత పెరుగుతూ వస్తుంది. క‌లెక్ట‌రేట్ కు వ‌చ్చే వారి కోసం క‌లెక్ట‌ర్ వాహ‌నం పార్కింగ్ చేసే ప్రాంతంలోనే ఒకే ఒక‌ వాట‌ర్ ఫిల్ట‌ర్ ను ఏర్పాటు చేశారు. దాదాపు గ‌త నాలుగేళ్లుగా వేస‌వికాలం ప్రారంభం నుండి వాట‌ర్ ఫిల్ట‌ర్ ద్వారా ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించేవారు. ఫిల్ట‌ర్‌కు నీటి స‌ర‌ఫ‌రా కోసం ట్యాంకును అమ‌ర్చారు. గతంలో మంచి నీటి కుండలు ఏర్పాటు చేసి తాగునీటి స‌దుపాయం క‌ల్పించేవారు. అయితే ఈ ఏడాది వేస‌వి ప్రారంభం అయ్యి దాదాపు నెల గ‌డుస్తున్నా, ఎండ తీవ్ర‌త‌, వ‌డ‌గాలుల ప్ర‌భావం రోజు రోజుకు పెరుగుతున్నా వాట‌ర్ ఫిల్ట‌ర్ ను మాత్రం వినియోగం లోకి తీసుకురాలేదు. దీంతో క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు కోసం తాగునీటి స‌దుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ కార్యాల‌యాల్లో ప‌నుల కోసం వ‌చ్చే వారు బ‌య‌ట నుండో లేక క‌లెక్ట‌రేట్ క్యాంటిన్ లోనో పైస‌లు పెట్టి వాట‌ర్ బాటిల్స్ కొనుక్కొని ద‌ప్పిక తీర్చుకుంటున్నారు. ప్ర‌జ‌లంద‌రు వాట‌ర్ ఫిల్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ..అక్క‌డ తాగునీటి లేక‌పోవ‌డంతో త‌ప్పని ప‌రిస్ధితుల్లో వాట‌ర్ బాటిల్స్ కొనుగోలు చేయ‌డం జ‌రుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి వ‌చ్చే వారికి బాటిల్స్ కొన‌డమ‌నేది ఆర్థిక‌భారంగా మారుతుంది.

వెంట‌నే తాగునీటి స‌దుపాయం క‌ల్పించాలి

జిల్లా ప‌రిపాల‌న అధికారితో స‌హా జిల్లాకు సంబంధించిన అన్ని శాఖ‌ల ముఖ్య‌ అధికారులు రోజు వ‌చ్చే క‌లెక్ట‌రేట్ ప్రాంగణంలోనే క‌నీసం మంచినీటి స‌దుపాయం కల్పించ‌పోవ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దూర ప్రాంతాల నుండి వ‌చ్చిన త‌మ‌కు క‌నీసం మంచినీటి స‌దుపాయం క‌ల్పించ‌పోవ‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వేస‌వి మొద‌లై నెల రోజులు కావ‌స్తున్నా ఎండ తీవ్ర‌త క్ర‌మంగా పెరుగుతున్నా అధికారులు నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే చుక్క తాగునీరు అందించ‌లేని ప‌రిస్ధితి నెల‌కొంది. వెంట‌నే వాట‌ర్ ఫిల్ట‌ర్ ను వినియోగంలోకి తెచ్చి తాగునీటి స‌దుపాయం క‌ల్పించాల‌ని , లేదా వాట‌ర్ ఫిల్ట‌ర్ ప‌నిచేయ‌ని ప‌క్షంలో క‌నీసం మంచినీటి కుండలను,రంజ‌న్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. కొత్త‌గా సంగారెడ్డి క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు తీసుకున్న ప్ర‌తీక్ జైన్…ప్ర‌త్యేక చొర‌వ తీసుకోని వీలైనంత త్వ‌ర‌గా క‌లెక్ట‌రేట్ లో ప్ర‌జ‌ల సౌక‌ర్య‌ర్ధం తాగునీటి స‌దుపాయం క‌ల్పించాల‌ని కోరుతున్నారు. కేవ‌లం సంగారెడ్డి కలెక్ట‌రేట్ అఫీసులోనే కాకుండా జిల్లాలోని ప్ర‌తి ప్రభుత్వ కార్యాలయాల్లో మంచినీటి వసతి కల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన‌ అవ‌స‌రం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>