కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైస్ మిల్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో (Rice Millers ) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Nizamabad Police Commissioner Sai Chaitanya) సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, ధాన్యం దిగుబడులు, కొనుగోళ్లు, విక్రయాలు, ప్రజలకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
జిల్లా వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం, పంటల సాగు దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉండటంతో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లు, విక్రయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించడం లేదా కృత్రిమ కొరత సృష్టించే చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు , అనుమతులు, వర్తించే ధరల మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు, విక్రయాలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమైన బియ్యం అందుబాటులో ఉండేలా, ధరల విషయంలో సామాన్య ప్రజలపై అదనపు భారం పడకుండా సహకరించాలని కోరారు.
రైతుల కష్టాన్ని గుర్తించి వారి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ప్రజలకు నిత్యావసరమైన బియ్యం సరసమైన ధరలకు లభించేలా రైస్ మిల్లర్లు, అసోసియేషన్ల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, రవాణా, విక్రయాల విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ధాన్యం, బియ్యం సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత వర్గాలు సహకరించాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.

