నేటి అర్థరాత్రి నుంచి బంద్ కు పిలుపు.. మంత్రి పొన్నం కీలక విజ్ఞప్తి

కలం, మెదక్ బ్యూరో : నేటి అర్థరాత్రి నుంచి ఆటోలు బంద్ చేస్తామని తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె ఆలోచనను విరమించుకుని ప్రభుత్వంతో చర్చలకు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… సమస్యలను సమ్మె ద్వారా కాకుండా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవచ్చని,ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం అన్నారు .

ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ:

2012 తర్వాత రాష్ట్రంలో ఆటో చార్జీలు పెరగలేదని, పెరిగిన పెట్రోల్, డీజిల్, వాహనాల ధరలు మరియు నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో ఆటో కార్మికుల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలను భాగస్వామ్యం చేసి సమగ్రంగా చర్చించిన తర్వాతే న్యాయమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు:

ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని , దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందించి బోర్డును అమల్లోకి తెస్తామన్నారు.అలాగే హైదరాబాద్‌లో కాలుష్య నివారణతో పాటు కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఇ-ఆటోలకు మారే ప్రతి వాహనానికి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసే వారికి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

దశలవారీగా ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆటో కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎలాంటి విధానం తెస్తే మేలు జరుగుతుందో ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఆటో కార్మిక సోదరులు సమ్మెకు వెళ్లకుండా, ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి భాగస్వామ్యులు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>