Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్‌ నినో ఎఫెక్ట్‌నూ పట్టించుకోని ప‌సుపు రైతులు!

కలం, నిజామాబాద్ బ్యూరో: పసుపు పంటకు ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా ప్రసిద్ధి. ఇప్పటికే రైతులు పంట సాగు పనులు మొదలుపెట్టారు. ప్రపంచంలోనే అత్యధిక కర్కుమిన్ రకం టాప్ క్వాలిటీ పసుపు ఎగుమతి నిజామాబాద్ నుంచే అవుతుండడం విశేషం. ఏటా పసుపు ధరలపై పంట ఆలోచన చేసే రైతులు ఈసారి ఎల్ నినో ప్రభావం ఉంటుందని తెలిసినా పసుపు పంట వేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈసారి పసుపు సాగు (Turmeric Cultivation) విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో పసుపు విత్తన మొక్కలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొరత కారణంగా కమ్మర్ పల్లి పసుపు పరి శోధన కేంద్రంలో విత్తనోత్పత్తి చేపట్టారు. ఒక్క రోజే లక్ష మొక్కలను రైతులు తీసుకెళ్లారు. వీటిలో సేలం, రాజపురి, రాజేంద్ర సోనియా, దుగ్గిరాల ఎరుపు నాలుగు రకాల వంగడాలను అధికారులు పంపిణీ చేశారు.

అందుబాటులో 318 వంగడాలు

కమ్మర్ పల్లి పసుపు పరిశోధనా కేంద్రంలో ఇప్పటి వ‌రకూ 318 పసుపు వంగడాలు అందుబాటులో ఉండగా.. వారసత్వంగా సాగు చేస్తున్న వంగడాలు సేకరిస్తూ వస్తున్నారు. వీటితో కొత్త వంగడాలను సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగానే పసుపు విత్తన మొక్కలను రైతులకు అందిస్తున్నారు. తద్వారా విత్తన మార్పులో కొత్త ప్రయోగం కూడా రైతులకు పరిచయం చేయడం ద్వారా దిగుబడులు పెరుగుతాయి. వీటి వల్ల పంటకాలానికి నెల ముందే చేతికి వస్తుంది. రైతులు విత్తనాలు వేస్తే సాధారణంగా 20 రోజులు మొలకెత్తడానికి పడుతుంది. అవి మొలకెత్తుతాయో లేదోననే టెన్షన్ కూడా ఉంటుంది.

కానీ, ఇవి రూట్ ఎస్టాబ్లిష్ మెంట్ అవుతుండగా ఆందోళన లేదు. ఈజీగా రూట్ లు వచ్చేస్తాయి. దుంప సైజ్ కూడా రైతులు 25 నుంచి 30 గ్రాములు వేస్తారు. శాస్త్రవేత్తలు ఇచ్చినవి 5 నుంచి 10 గ్రాముల విత్తనం కావడంతో 25 శాతం విత్తన అవసరం, ఖర్చు తగ్గుతుంది. రైతులు ఎకరానికి 600 నుంచి 800 కిలోలు వేస్తారు. అదే శాస్త్రవేత్తలు ఇచ్చేది నాటితే 35 వేల మొక్కలు చాలు. నల్ల పసుపు, మామిడి, అల్లం కూడా కమ్మర్ పల్లి పసుపు పరిశోధనా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. పసుపు వంగడాలు తెలంగాణకు సెట్ అయ్యే రకాల్లో ఎర్ర గుంటూరు(ఆర్మూరు లోకల్), సేలం, రాజపురి (దిగుబడి ఎక్కువ కర్కుమిన్ రకం), బీఎస్ఆర్ 2 (రోగ నిరోధక శక్తి ఎక్కువ), దుగ్గిరాల రెడ్ రకాలకు డిమాండ్ ఎక్కువ ఉంది.

జోరుగా పసుపు సాగు

ఈసారి పంపిణీ చేసిన మొక్కలు కూడా 30 రోజులవి కావడం విశేషం. ఒక్కో రైతుకు వెయ్యి మొక్కల చొప్పున 100 మందికి లక్ష పంపిణీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన పసుపు రైతులు వచ్చి మొక్కకు రూ.2 చెల్లించి వాహనాల్లో తరలించారు.

వర్షాలను బట్టి నాటాలి – విద్య, శాస్త్రవేత్త, పసుపు పరిశోధనా కేంద్రం

పసుపు విత్తనాలు వేసుకోవడానికి ఇదే అనువైన సమయం. కానీ వర్షాలు లేవు. అయితే.. డ్రిప్ ఉండి బోరు నీళ్లు అందుబాటులో ఉన్న రైతులు విత్తనాలు వేసుకోవచ్చు. వర్షాధారంపై ఆధారపడే వారు ఇంకో రెండు వర్షాలు పడ్డాక నాటుకుంటే మంచింది. లేదంటే భూమిలో వేడితో విత్తనాలు కుళ్లిపోతాయి. జూలై చివరలో కూడా వర్షాలు బాగా ఉన్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా జాగ్రత్తలు పాటించాలి. బెడ్ సిస్టం వేసుకున్నవారు ప్లాస్టిక్ మల్చింగ్ ఏ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎండు గడ్డి.. ఎండిపోయిన ఆకులు వేసుకుంటే కూడా నీళ్లను పీల్చుకుంటాయి. తద్వారా పసుపు విత్తనానికి ప్రయోజనం ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>